తెలుగునేలపై తనదైన ముద్ర వేసిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు సాయి సౌందర రాజన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో, ఆనాడు ఉద్యమనేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 డిసెంబర్‌లో దీక్ష చేయడం, అప్పటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం, దీనికి వ్యతిరేకంగా కృత్రిమంగా సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో.. 2009 డిసెంబర్ 29న ఆనాడు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010న ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్‌ను పూర్తికాలపు గవర్నర్‌గా నియమించారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచి తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహనతో నరసింహన్ వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత కీలక పాత్ర నిర్వర్తించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఆస్తుల పంపిణీ మొదలు అనేక సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో ఇరురాష్ర్టాల మధ్య సమస్యలను, వివాదాలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరడంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉమ్మడి సమావేశాలను గవర్నర్ ఏర్పాటుచేశారు. చంద్రబాబు హయాంలో పరిష్కారంకాని సమస్యలను ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చించి సామరస్యంగా పరిష్కారమయ్యేలా చూశారు. అనేక క్లిష్టమైన సమయాల్లో ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడిపించేందుకు గవర్నర్ నరసింహన్ సూచనలు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఉపయోగపడ్డాయి.