కడప టీడీపీ కుప్పకూలుతుందా..గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన తెలుగుదేశం పార్టీ…కడపలో పూర్తిగా సమాధి కాబోతుందా..జిల్లాలో కీలక నేతలంతా కాషాయ గూటికి చేరుకుంటున్నారా…ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్లే తాను కాషాయతీర్థం పుచ్చుకున్నట్లు ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో బలమైన నాయకుడైన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ప్రలోభపెట్టి తన పార్టీలోకి లాక్కున్నాడు చంద్రబాబు. పైగా మంత్రిపదవి కూడా కట్టబెట్టాడు. దీంతో ఆదినారాయణ రెడ్డి అడ్డూ, అదుపు లేకుండా ప్రవర్తించేవాడు. ఒకప్పుడు వైయస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, టీడీపీలోకి ఫిరాయించాక..టీడీపీ నేతలు కంటే ఎక్కువగా జగన్ని తీవ్ర పదజాలంతో విమర్శించేవాడు. ఇక జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలకు మధ్య ఎప్పటినుంచో వర్గ విబేధాలు ఉన్నాయి. ఈ రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుని ఎంతో మంది బలైపోయారు కూడా. అయితే టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి తర్వాత కూడా ఈ రెండు వర్గాల మధ్య వర్గ పోరు నడించింది. దీంతో చంద్రబాబు వీరిద్దరి పిలిపించుకుని మీకు వీలైనంతగా దోచుకోమని, వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకోండంటూ సెటిల్‌మెంట్ చేశాడు. అయినా ఇరు వర్గాల మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది.
2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కడప పార్లమెంట్ నుంచి ఆదినారాయణరెడ్డిని పోటీలో నిలిపాడు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో పులివెందులలో టీడీపీ జెండా పాత్తాయంటూ…జగన్ని తరిమేస్తామంటూ ఆదినారాయణ రెడ్డి రంకెలు వేశాడు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. దీంతో ఆదినారాయణ రెడ్డి సైలెంట్ అయ్యాడు. మారిన రాజకీయ పరిణామాల మధ్య టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. వైసీపీలో చేరే అవకాశం లేని వారంతా బీజేపీలో చేరుతున్నారు. దీంతో ఆదికి కూడా గత్యంతరం లేక బీజేపీలో చేరుతున్నాడు. కాని వెళుతూ వెళుతూ.. స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయనే పార్టీని వీడుతున్నా అని ఆది ప్రకటించడం వెనుక రామసుబ్బారెడ్డితో ఉన్న విబేధాల గురించేనా అన్న చర్చ.. జమ్మలమడుగులో జరుగుతోంది. అయితే జగన్‌కు వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణరెడ్డికి తగిన శాస్త్రే జరిగిందని రామసుబ్బారెడ్డి వర్గం అంటోంది. కాగా మరో పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో కడప జిల్లా టీడీపీ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మొత్తంగా ఆది నారాయణ రెడ్డి నిష్క్రమణతో కడప జిల్లా టీడీపీ ఖాళీ అవనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.