పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, గోమయ వినాయకులనే ప్రతిష్ఠించి, పూజించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐకే ఆర్ పౌండేషన్ ట్రస్ట్, క్లిమామ్ గోశాల ఆద్వర్యంలో శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గోమయ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. నేటి ఆధునిక సమాజంలో రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారైన గణపతులను ప్రతిష్టించడం వల్ల ప్రకృతికి చెడు జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించడం కోసం రసాయనాలతో కూడిన గణపతులను కాకుండా మట్టి, గోమయ వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని సూచించారు. సీయం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేయాలని ఆదేశించారు. సీయం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల మట్టి గణపతులను పంపిణీ చేశామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో 15 వేల వినాయక ప్రతిమలను నియోజకవర్గ ప్రజలకు అందజేసినట్లు వెల్లడించారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు గత నాలుగేండ్లుగా ఉచితంగానే గోమయ గణపతులను అందజేస్తున్న IKR పౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, క్లిమామ్ గోశాల నిర్వహకురాలు దివ్యారెడ్డిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. రానున్న రోజుల్లో “ఒక ఊరు ఒక గణపతి” అనే నినాదంతో ఏక గణేషున్ని ప్రతిష్టించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. మరోవైపు అడవుల పరిరక్షణ, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యమ్నాయా అడవుల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధ్యన్యతనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేఆర్ పౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
