ఆంధ్రా బ్యాంకు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఈ బ్యాంకు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురుకు తెల్సిన పేరు. అయితే ఈ బ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో వీలినం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న శుక్రవారం ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ బ్యాంకు ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది. ఎవరు స్థాపించారో చాలా మందికి తెలియదు. అయితే దానిపై ఒక లుక్ వేద్దామా..? .
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుండుగొలుసులో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆ రోజుల్లో అప్పటి ఏపీ రాజధాని అయిన మద్రాస్ లో వైద్య విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత మచిలీపట్టణంలో అడుగు పెట్టి డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆ సమయంలో ఒక రోజు తను నివాసముంటున్న ఇంటి ఎదురుగా ఉంటున్న వైశ్య సోదరులిద్దరూ డబ్బుల విషయంలో గొడవ పడటం మొదలెట్టారు.ఈ పంచాయతీ ఎటూ తేలకపోవడంతో న్యాయం కోసం సీతారామయ్య దగ్గరకొచ్చారిద్దరూ.
వచ్చి తమ దగ్గర ఉన్న డబ్బులను దాచమని ఆయన్ని కోరారు. అయితే ఆ సమయంలోనే అన్నదాతలు వ్యవసాయం కోసం పెట్టుబడులకు డబ్బుల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలను కళ్లారా చూసిన సీతారామయ్య ఒక బ్యాంకును స్థాపించాలని నిర్ణయం తీసుకుని బందరులోని పుర ప్రముఖుల సాయంతో లక్ష రూపాయల మూలధనంతో 1923నవంబర్ 20న ఆంధ్రా బ్యాంకు పేరిట స్థాపించాడు. అయితే దాదాపు వారంరోజుల పాటు సీతారామయ్య ఇంటి ఎదురుగా ఉన్న అరుగుపైనే బ్యాంకుకు సంబంధించి లవాదేవీలు సాగేవి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మూడు వేలకుపైగా ఆ బ్యాంకు శాఖలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు వెనక ఉన్న అసలు కథ ఇది అన్నమాట.