సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 6సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ సమయంలో జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. సర్వేపల్లిలోని వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఉన్న భూమిపై సోమిరెడ్డి కన్నుపడింది. ఇక్కడి నుంచే చిక్కులు మొదలయ్యాయి. తనది కాని భూమిని తన భూమిగా రికార్డులు మార్పులు చేయించి చెన్నైకు చెందిన వారికి విక్రయించారు. దీంతో ఆ భూమి వారసులు తెరపైకి వచ్చి భూమి తమదని రికార్డులతో సహా గతేడాది నుంచి చూపుతున్నారు. ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో మంత్రిగా అప్పట్లో సోమిరెడ్డి హవా కొనసాగింది. దీంతో బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు ఈ నెల 27న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఈ నెల 24వ తేదీన ఆదేశాలు ఇవ్వడంతో 212/2019 నంబర్‌తో 120బి, 471, 468, 447, 427, 379, 34ఐపీసీ, 156(3) సీఆర్‌పీసీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
