తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017 జూన్ నాటికి ప్రభుత్వ దవాఖానల్లో 35 శాతం ఉన్న ప్రసవాలసంఖ్య 62 శాతానికి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సిజేరియన్ల సంఖ్య 80 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకంతో తల్లీ, బిడ్డ దవాఖాన నుంచి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. దిగ్విజయంగా అమలవుతున్న కేసీఆర్ కిట్ల పథకానికి జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతుండగా.. పలు రాష్ట్రాలు అమలుచేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా, ఈ పథకాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం ప్రశంసించింది. 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైన నాటినుంచి 2019 జనవరి చివరి నాటికి 4,52,800 మంది బాలింతలకు లబ్ధిచేకూరింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా వెచ్చించింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్.. బాలింతల కోసం 16 వస్తువులతో కూడిన కిట్ల పథకం అమలుచేస్తున్నారు.
తొలి కాన్పులో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్రంలోని 12 సర్కారు దవాఖానల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రత్యేక చర్యలతో మంచి ఫలితాలు సాధించారు. ఇతర దవాఖానల్లోనూ ఐదు నెలలుగా దీనిని అమలుచేస్తుండటంతో సిజేరియన్లు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సగటున 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గినట్లు వైద్యశాఖ అంచనాలు రూపొందించింది. నీతిఆయోగ్ విడుదల చేసిన తాజానివేదికలో.. ప్రసూతిసేవలు అం దించడంలో తెలంగాణ కి దేశంలోనే మొదటి స్థానం దక్కింది. నీతిఆయోగ్, ప్రపంచబ్యాంకు, కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ సంయుక్తంగా హెల్త్ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇం డియా పేరిట ఈ నివేదికను రూపొందించాయి.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో తీసుకువస్తున్న మార్పుల కారణంగా తెలంగాణలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పేదలు పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. రాష్ట్రంలో ప్రసవ మరణాల శాతం, నవజాత శిశుమరణాల సంఖ్య తగ్గుతున్నదని మెటర్నిటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా విడుదలచేసిన ప్రత్యేక బులెటిన్ తాజా నివేదికలో పేర్కొన్నది.
భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించి తెలంగాణలో ఆరోగ్యసమాజాన్ని సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య పథకాలను అమలుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యం. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా తెలంగాణ సర్కారు కేసీఆర్ కిట్లు- అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. ఒకవైపు గర్భిణుల ఆరోగ్యానికి ప్రాధాన్యం కల్పిస్తూనే భవిష్యత్‌తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానంగా పిల్లల ఆరోగ్యంపై దృష్టిసారించింది. మాతాశిశు సంరక్షణకోసం అధునాతన సౌకర్యాలతో, కార్పొరేట్ తరహాలో సర్కారు దవాఖానల్లో వైద్యాన్ని అందిస్తున్నారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటుచేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేవిధంగా చర్యలు చేపట్టారు.
Post Views: 315