వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ గత కొద్ది రోజులగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే రాజధాని అని స్పష్టం చేసినా..బాబు మాత్రం ఇంకా రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ఇక ఏపీ .బీజేపీ నేతలు కూడా మొదట్లో కాస్త రాజధానిపై హడావుడి చేశారు…ముఖ్యంగా చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిలో పర్యటించి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. అయినా ప్రభుత్వపై భరోసాతో రైతులు నిశ్చింతగా ఉండడంతో చంద్రబాబు తన పార్టనర్ జనసేన అధ్యక్షుడు అయిన పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ శుక్రవారం పలువురు టీడీపీ నేతలతో కలసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, ఉప్పలపాడు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. సమస్యలు తెలుసుకునే పేరిట పవన్ చేసిన పర్యటనలో పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు ఆదేశంతోనే పవన్ రాజధానిలో పర్యటిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. కాగా, రాజధాని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్‌కళ్యాణ్ గ్రామాల్లోని పలుచోట్ల స్థానికులతో మాట్లాడారు. రాజధానిని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదని అన్నారు. రాజధాని పేరుతో దోపిడీలకు, అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే..వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, మంగళగిరి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్యతో పాటు పలువురు టీడీపీ నాయకులున్నారు. దీంతో రైతులను రెచ్చగొట్టడానికే చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపాడని తేలిపోయింది. దీంతో పవన్, చంద్రబాబుల బంధం మరోసారి బట్టబయలైపోయింది.