తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కీసరగుట్ట అభయారణ్యాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ అక్కడకి చేరుకుని పెద్దెత్తున మొక్కలను నాటి హారిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు పెద్దెత్తున కీసరగుట్ట కు తరలివచ్చి.. 15 వేల మొక్కలను నాటారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2042 ఎకరాల అటవీ ప్రాంతం మొత్తం మొక్కలను నాటి.. పచ్చదనంను పెంచాలనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం చేపట్టారు. తొలి విడుతగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మూడు కోట్ల రుపాయలను కేటాయించారు.
అందరి సహకారంతో కీసర అభయారణ్యాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే.. కీసర అటవీ ప్రాంతం అభివృద్ధిని చేపట్టానని .. ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు. గత 20 ఏళ్లుగా సీఎం కేసీఆర్ వెంట నడిచానని.. ఏ పనిని చేపట్టినా.. పూర్తి చేయాలనే పట్టుదలను ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు. కీసర రామలింగేశ్వరస్వామి సాక్షిగా అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ కీసర అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నరు మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. రెండు వేల ఎకరాలకు పైగా అటవీ భూముల్లో పచ్చదనం పెంపునకు.. ఎంపీ నిధుల నుంచి 3 కోట్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని .. ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. అంతకుముందు కీసర రామలింగేశ్వర స్వామిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌కు మంత్రి మల్లారెడ్డి తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
