సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం లేదు.
రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ,విప్ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న కీసర గుట్ట దత్తత అనే పర్యావరణ ఆలోచన దేశంలో ప్రతి ఒక్క ఎంపీని , ఎమ్మెల్యేని , ఇతర ప్రజాప్రతినిధులను ఆలోచింపజేసేదిగా ఉంది . ప్రజాప్రతినిధులు ప్రకృతిని ప్రేమించాలనే ఒక కొత్త ఒరవడికి ఎంపీ సంతోష్ గారు అంకురార్పణ చేశారు .
ఇక కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలోని అడవి తల్లికి సాంత్వన దొరికినట్లే . ఎంపీ నిధులో , సన్నిహితుల సహకారమో ఏదో ఒక రకంగా కీసర అడవి అభివృద్ధికి బాటలు పడ్డట్లే . ఈ కీసర సభలో హుందాగా మాట్లాడిన సంతన్న తనకు వీలైనప్పుడల్లా కీసర అటవీ ప్రాంతాన్ని సందర్శించి అడవి తల్లి సేవ కోసం ప్రయత్నిస్తానని వినమ్రంగా చెప్పి ముగించారు . తెలంగాణలో ఉన్న ఇతర అటవీ ప్రాంతాల అభివృద్ధికి కూడా అక్కడి ప్రజాప్రతినిధులు ఇదే స్పూర్తితో అడుగు ముందుకు వేస్తారని ఆశిద్దాం .