ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిని సేకరించిన చోటే శుద్ధి చేసి, అక్కడ నుంచి ప్రజలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై నిశితంగా అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల స్థితిగతులపై దృష్టి పెట్టాలని చెప్పారు. చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో తాగునీరు నింపాక కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితులు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా వారి ఇళ్లకే తాగునీరు సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
