హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో రహస్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తి హాజరైనారు. కాసేపట్లో సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకావడం విశేషం. కేంద్రంలో రెండవ సారి పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రెండూ బలహీనపడడంతో వాటి స్థానంలో తాము ప్రధాన ప్రతిపక్షంగా ఎదగేందుకు కమలనాథులు స్కెచ్ వేశారు. ఇప్పటికే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది..తొలుత టీడీపీ రాజ్యసభ పక్షాన్ని తమ పార్టీలో కలుపుకున్న కమల నాథులు టీడీపీలోని కీలక నేతలపై దృష్టి పెట్టింది.
కాగా టీడీపీలో క్రమేణా అంతర్గత సంక్షోభం నెలకొంటుంది . చంద్రబాబు తీరుపట్ల , లోకేష్ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బీజేపీ లేదా…వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి వైయప్ జగన్ సుముఖంగా లేడు. దీంతో అలాంటి నేతలకు బీజేపీ వల విసురుతోంది. టీడీపీలోని కీలక నేతలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని పూర్తిగా నిర్విర్యీం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే టీడీపీ కీలక నేతలు బీజేపీలోకి చేరకుండా చంద్రబాబు సన్నిహితుడైన తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరి అడ్డుకుంటున్నాడని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీక్రెట్ మీటింగ్‌కు సుజనా కూడా హాజరు కావడం ఆసక్తి రేపుతోంది. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మీటింగ్ హాజరు కావడంతో ఏదో పెద్ద వ్యవహారమే జరుగబోతుందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ సీక్రెట్ మీటింగ్ తర్వాత ఏపీ బీజేపీ జోరు పెంచుతుందా…టీడీపీ దుకాణం బంద్ చేయించేలా ఏమైనా ప్లాన్స్ వేశారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.