పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఇసుక విధానంపై ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇదే ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన్ను అక్కడినుంచి యలమంచిలి స్టేషన్‌కు తీసుకురావడంతో అక్రమంగా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే రామానాయుడు , ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ స్పష్టం చేశారు.
