తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు, స్వరాష్ట్రంలో పరిపాలనా విధానం, జరుగుతున్న ప్రగతి, ఇతర ముఖ్య పరిణామాలపై సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రూపొందిన సవివరణమైన, సాధికారిక గ్రంథం ‘ఉజ్వల ప్రస్థానం’ ఆవిష్కరణ హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయిత విజయ్ కుమార్ సన్నిహితుల మధ్య పుస్తకావిష్కరణ సభ జరిగింది. చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్ల ప్రభాకరరావు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎసీబీ డీజీ పూర్ణచందర్ రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం చీఫ్ పీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్, గ్రంధాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి, విప్లవ సినిమాల దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి సభకు హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సభకు సమన్వయ కర్తగా వ్యవహరించారు.
తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్ కార్యాచరణపై రూపొందించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకం తొలికాపీని జెక్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు గారు ఆవిష్కరించి ఘంటా చక్రపాణికి అందించారు. వివిధ పత్రికల్లో కొన్ని సంవత్సరాలుగా విజయ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం బంగారు బాట అనే మరో పుస్తకం తొలికాపీని రాజీవ్ శర్మ ఆవిష్కరించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అందించారు.
చారిత్రక పూర్వయుగం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన పరిణామ క్రమాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ రచయిత విజయ్ కుమార్ ఈ పుస్తకంలో వివరణాత్మకంగా పొందుపరిచారని సభకు హాజరైనవారు ప్రశంసించారు. రానున్న తరాలకు తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలినాళ్లలో పాలనా సంస్కరణలకు ఈ పుస్తకం ఒక రెఫరెన్స్ గైడ్ లా ఉపయోగపడుతుందని చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అన్నారు.
విజయ్ కుమార్ తనకు దత్తపుత్రుడు లాంటి వాడని, తెలంగాణ విద్యుత్ వెలుగుల వెనుక ఆ శాఖ ఉద్యోగుల శ్రమ ఉంటే దానిని వెలుగులోకి తెచ్చింది మాత్రం విజయ్ కుమారే అన్నారు జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు. తెలంగాణ రాష్ట్ర ఉజ్వల ప్రస్థానం రానున్న రోజుల్లోనూ బంగారు బాటలా సాగేందుకు, ఈ విషయాలన్నీ సమాజంలోని వారికి తెలిసేందుకు ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయని ప్రభాకరరావు ఆకాంక్షించారు. నిత్య శ్రామికుడైన విజయ్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని పుస్తకాలు రావాలని కోరారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి. తెలంగాణలో జరిగిన, జరుగుతున్న ప్రస్థానం ఈ పుస్తక రూపంలో ఉజ్వలమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పాలనను ఈ పుస్తక రూపంలో సామాన్యులకు అందుబాటులో తెచ్చారని ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, ఆ తర్వాత పాలనలోనూ మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, రాజీ పడకుండా శ్రమ పడటంలోనే ఇలాంటి రచనలు సాధ్యం అయ్యాయి అన్నారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఈ రెండు పుస్తకాలు రెఫరెన్స్ గైడ్ లా ఉపయోగపడతాయని, వీటిని ఇంగ్లీషులోనూ తేవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చీఫ్ పీఆర్వో వనం జ్వాలా నరసింహారావు. ఉద్యమ నేపథ్యంలో విజయ్ రాసిన జ్వలిత దీక్ష పుస్తకంతోనే ఆయన ప్రతిభ బయటపడిందని, ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్రకు ఒక ఎన్ సైక్లోపీడియాలా ఉపయోగపడుతుందన్నారు గ్రంధాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్. ప్రజల ఆకాంక్షల రూపమైన ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ పరంగా, విధాన నిర్ణయాలు ఏం జరుగుతున్నాయని ప్రజలకు తెలియజేసిన వ్యక్తి గటిక విజయ్ కుమార్ అని అన్నారు నమస్తే తెలంగాణ ప్రధాన సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి. యాక్టివ్ జర్నలిస్ట్ గా, ప్రజా సంబంధాల అధికారిగా విజయ్ ప్రస్థాన ఆదర్శవంతంగా సాగుతోందని ప్రశంసించారు. ఎసీబీ డీజీ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో జరుగుతున్న అద్భుతమైన పాలనను సమాజంలో అందరికీ చేరువ చేసేలా పుస్తకాల రచన కొనసాగిందన్నారు. ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాలు నేటితో ప్రజలకు అంకితం అయ్యాయని, ఇవి తెలంగాణ సంపదగా వెలుగొందుతాయని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సమాచార సేకరణలోనూ, వాటిని సులభంగా ప్రజలకు చేరవేసేలా రాయటంలోనూ రచయితగా విజయ్ కుమార్ సవ్యసాచిగా నిరూపించుకున్నారని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కొనియాడారు. నెక్కొండ గ్రామం నుంచి తల్లి సుగుణ ఆశీస్సులతో ఎదిగిన విజయ్ ప్రస్థానం తాను దగ్గరి నుంచి చూశానని, ప్రతీ ఒక్కరికీ ఒక సమాచార నిధిలాగా వివరాలు అందించటం ఆయన ప్రత్యేకత అని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సభలో పాల్గొన్న విప్లవ సినిమాల దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి తన ప్రసంగంతో సభికులను ఉత్తేజిత పరిచారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు కలిసి పనిచేయటం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. రచయిత, గాయకుడు జయరాజ్ కూడా సమావేశంలో పాల్గొని తెలంగాణ ప్రస్థానంపై మాట్లాడారు.
సభలో పాల్గొన్న అధికారులు, ప్రముఖులు, హాజరమైన స్నేహితులు, సన్నిహితులకు రచయిత విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, కుటుంబం, సన్నిహితుల తోడ్పాటుతో తాను రచనలు చేయగలిగానని, తనను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.