ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లు సఖ్యతగా వ్యవహరిస్తూ…విభజన సమస్యలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతే కాకుండా ఇరు రాష్ట్రాల ప్రజల మేలు కోసం ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో రగిలిన విద్వేషాలు తొలగి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహ భావం వెల్లివిరిస్తుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు, లోకేష్‌కు, టీడీపీ నేతలకు బుద్ధి రావడం లేదు. మచిలీపట్టణం పోర్టును జగన్ కేసీఆర్‌కు కట్టబెడుతున్నారంటూ…బాబుగారి పుత్రరత్నం లోకేష్ హాస్యాస్పద విమర్శలు చేశాడు. ఇక ఏపీ సీఎం జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్య అతిధిగా హాజరవడాన్ని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా తప్పుపట్టాడు. జగన్, కేసీఆర్‌లు కుమ్మక్కై ఏపీ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు పదే పదే పాత పాట పాడుతున్నారు. తాజాగా ఏపీకి ఆర్థికమంత్రిగా పనిచేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాజాగా తెలంగాణ లబ్ధి కోసమే ఏపీకి సీఎం జగన్ గండికొడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు.
తాజాగా యనమల వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా? అంటూ విజయసాయిరెడ్డి యనమలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయ సాయిరెడ్డి ట్వీట్‌కు నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందించారు. చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతూ…రాష్ట్రాన్ని దివాళ తీసిన యనమలకు వైసీపీ ప్రభుత్వంపై మాట్లాడే అర్హతే లేదంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా యనమలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.