తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేయాలని స్పష్టంచేసింది. ఆయా ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో డెంగీ పరీక్షలు ఉచితమంటూ ప్రజలందరికీ కనిపించేలా బోర్డు లు కూడా ప్రదర్శించాలని సూచించింది. అన్ని చోట్లా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, గంటకు మించి ఎవరూ వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టంచేసింది. ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు డెంగీ జ్వరం లేకున్నా, తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువగా తక్కువగా చూపించి, ఐసీయూకు తరలించి లక్ష రూపాయలకు వరకు గుంజుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి 20 వేల లోపు ప్లేట్లెట్ల కౌంట్ తగ్గితేనే ప్రాణాలకు అపాయం. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు 50 వేల కౌంట్ ఉన్నా చికిత్స పేరుతో రోగులను దోపిడీ చేస్తున్నాయని తెలుస్తోంది. ఇలాంటి ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొత్తంగా డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయించుకోవచ్చని, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
