ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సభావేదిక పక్కనే ఉన్న అటవీశాఖ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు సభావేదికపై సీఎం జగన్ ప్రసంగించనున్నారు.అందుకు సంబంధించి జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లాలోని మేడికొండూరు మండలంలోని పేరేచర్ల సమీపంలో డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అటవీ ప్రాంతానికి ఆనుకొనివున్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో సభావేదిక, ప్రాంగణం ఏర్పాట్లు చేపట్టారు. జాతీయ రహదారి పక్కనే సభావేదిక నిర్మిస్తుండడంతో ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు రూట్‌మ్యాప్ తయారుచేస్తున్నారు.సీఎం కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు.ఎక్స్‌కవేటర్లతో భూమిని చదును చేయడంతోపాటు పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిని కేంద్రేకరించారు. దాంతో అటవీశాఖ అధికారులు, మండల అధికారుల కనుసన్నల్లో ఏర్పాట్లను చేస్తున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను తాడికొండ శాసన సభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పర్యవేక్షించారు. సమీప పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు తాడికొండ, గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని, అందుకు తగ్గట్టుగా సభావేదిక, ప్రాంగణం నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడలో బయల్దేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద వర్థంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అదే రోజు సాయంత్రానికి విజయవాడకు తిరిగి వస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి….