పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం…కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు.గత పాలకులు పాలమూరును కరువు జిల్లాగా మార్చారని.. తాము.. పచ్చని పంటల జిల్లా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. ఈసారి అదృష్టం కొద్దీ కృష్ణాలో నీళ్లున్నాయి. రాబోయే రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నామని తెలిపారు.నదుల అనుసంధానంపై ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చినమని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో గోదావరి-కృష్ణా లింక్ చేస్తామని చెప్పారు . నదుల అనుసంధానంపై ఇరురాష్ట్రాలు తగిన రీతిలో అగ్రిమెంట్ చేసుకుంటాయని వెల్లడించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం వల్ల 570 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కలిగిందన్నారు.చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదన్నారు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానని సీఎం ఎద్దేవా చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కరివెన రిజర్వాయర్ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలకు సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. “మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్ చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్టులు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని ఎండలు ముదురక ముందే పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేటాల్లకు రైతుల పంటలకు మన నీళ్ళందే తట్టుండాలే.
ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్యలు లేవు అక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడ కొన్ని ఫినిషింగ్ పనులు తప్ప పెద్ద పనేమీలేదాడ. ఇక మన దృష్టి అంతా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మీదనే కేంద్రీకరించాలి. మీ మిషన్లను కూడా పెంచండి. త్వరితగతిన పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఇంటెన్స్ వ్లు ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఆ విషయం కూడా మాకు స్పష్టం చేయాలి తప్ప పనుల్లో తాత్సారం జరగడానికి వీలు లేదు. వచ్చే వానకాలం వరకు పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలి” అని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.