ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా వైసీపీ నేత బొత్సకు సవాల్ విసిరారు. దీంతో బొత్స ప్రెస్‌మీట్ పెట్టి మరీ అమరావతిలో సుజనా భూదందాను బయటపెట్టారు. ‘సుజనా చౌదరి కంపెనీ బోర్డు డైరెక్టరు జితిన్‌కుమార్ కు కళింగ గ్రీన్‌టెక్ కంపెనీ పేరుతో కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉన్నది వాస్తవం కాదా? ఇది సుజనాకు ఉన్న 120 కంపెనీల్లో ఒకటి కాదా? సుజనా సోదరుడి కుమార్తె రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాల భూమి ఉంది. ఒక్క ఎకరా చూపించమన్న సుజనాకు ఇప్పుడు 124 ఎకరాలు చూపించాను. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రస్తుతం సుజనా, బొత్సల నడుస్తున్న మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ అంశంపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుజనా తీరును ఎండగట్టారు. బీజేపీలో ఉండి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతావా…నీ చంద్ర భక్తిని బీజేపీ గమనిస్తుంది జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అసలు మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే గదా సుజనా చౌదరి గారూ? రెండు సార్లు రాజ్యసభ సభ్యుడవడానికి, కేంద్ర మంత్రి పదవి కోసం ఛంద్రబాబు గారికి ఎంత కప్పం కట్టారో బహిరంగ రహస్యమే. ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు. అలాంటి మీరు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో రచ్చ చేస్తున్నావు…ఒక ఎకరం కూడా కొనలేదు అంటున్నావు.. సరే..బినామి పేర్లపైన వందల ఎకరాల భూములు కొన్న వారి చిట్టా త్వరలోనే బయటకొస్తుంది. దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది. బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఉన్నవాళ్లు ఆస్తులు అటాచ్ కాకుండా బినామీ పేర్లు పెడతారన్నది జగమెరిగిన సత్యం.పార్టీ మారినంత మాత్రాన పునీతులైపోరు సుజనాచౌదరి గారు అంటూ విజయసాయిరెడ్డి కడిగిపారేశారు. బీజేపీలో చేరినా ఇంకా చంద్రబాబు పాట పాడుతున్న సుజనా వ్యవహారంపై స్పందిస్తూ…”అసలు మీరు బిజెపీలో చేరినా మీ హృదయం నిండా చంద్రబాబు గారే ఉన్నారు. ఆయన కోవర్టుగానే కదా మీరు పార్టీ మారింది. మీ ప్రతి చర్యనూ బిజెపి గమనిస్తుందనే అనుకుంటున్నాను. బిజెపీలో చేరి వారి విధి విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసి పోతూనే ఉందంటూ విజయసాయిరెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఇటీవలి వరద ముంపు నేపథ్యంలో, ఇప్పుడు రాజధాని విషయంలో చంద్రబాబుకు మద్దతుగా పలుకుతున్న బీజేపీ నేత సుజనా చౌదరికి విజయసాయిరెడ్డి తన సెటైరికల్ ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు. దీంతో నెట్‌జన్లు సింగం సుజాతా కాదు..బినామీ సుజనా అంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.