జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. రాష్ట్రంలో పరిచయం అక్కరలేని ప్రాజెక్ట్…ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2004లో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో కొందరి జేబులు నింపుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాల వల్ల నిర్మాణం పూర్తికాక 15 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది.60 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించడంతో అంచనా వ్యయం రెట్టింపైంది. 2016 నాటికే రూ.13,445 కోట్లకు చేరింది.
ఇప్పటి వరకు రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయినా ఏటా లక్ష ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి, రెండో దశలో చేపట్టిన మైనర్, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాలు, మూడో దశలో చేపట్టిన ఎనిమిది ప్యాకేజీల పనులు నామ్‌కే వాస్తే అన్నట్లు నడుస్తున్నయ్. అత్యంత ప్రధానమైన భీమ్ ఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయి ఎనిమిదేండ్లు అవుతోంది.కాగా, పనులు వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2020 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ మూడో ప్యాకేజీ కింద చేపట్టాల్సిన సొరంగ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని గతంలో కోస్టల్ కంపెనీ చేపట్టేది ఇప్పుడు మేఘ కంపెనీకి పనుల బాధ్యత అప్పగించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందించేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు.