టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం మాజీ విప్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్‌రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్‌తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్ 353, 427, 506, 143, ఆర్‌డబ్ల్యూ 149, సెక్షన్ (3) పీడీపీపీ యాక్ట్ 1984 లతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రవికుమా ర్ ముందస్తు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసులలో ఉన్న వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులను అయినా తీసుకువచ్చి నిందితులు ఆచూకీ తెలుసుకునేందుకు పోలీ సులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రవికుమార్ ఉద్యోగులను అవమానించారని ఏపీ ఎన్‌జీఓ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వారు చెబుతున్నారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరిస్తున్నారు..
