రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. – ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. – గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018లో నీళ్లు ఇస్తాం.. అని రాసుకో అని అన్నారు. 5 ఏళ్ళ పాలన పూర్తైన తర్వాత కూడా అవే మాటలు చెప్పారు. దాంతో ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. – మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అదే భజన చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.- గత ఐదేళ్లు పగలంతా పోలవరం.. మధ్యాహ్నం అమరావతి అన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరించారు. అమరావతిని బ్యాంకాక్ చేస్తా.. సింగపూర్ చేస్తానంటూ రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల కనీస అవసరాలు గాలికొదిలేశారన్నారు.- పోలవరం, అమరావతి భజనను చంద్రబాబు ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవదని అన్నారు. – ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు సమీక్షించకుండా.. ఇంకా అమరావతి-పోలవరం భజనను చంద్రబాబు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అతిదారుణంగా చంద్రబాబును ప్రజలు ఓడించారు. ఈ భజన ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కొడాలి నాని.. వ్యాఖ్యానించారు.
పోలవరం ఆపుతామని సీఎం వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం.. కాకపోతే 3నెలలు, 4 నెలలు ఆలస్యం అవుతుంది. ప్రాజెక్టు పేరుతో.. రాష్ట్ర ఆదాయాన్ని గత పాలకులు దోచుకున్నారు. దాన్ని అరికట్టడానికే రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని అన్నారు. – రాజధానిపై అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, వీటిని సమీక్షించుకొని ముందుకువెళ్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారని కొడాలి గుర్తు చేశారు. – చంద్రబాబు వైఖరి ఇదే విధంగా ఉంటే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కూకటివేళ్లతో పెకలించుకుపోతుందని కొడాలి నాని తెలిపారు. – పోలవరం-రాజధానులతో పాటుగా ఇతర జిల్లాల అభివృద్ధీ మాకు ముఖ్యమని.. ఈ రెండింటిని పట్టుకుని వేలాడి మిగిలిన ప్రాంతాలను గాలికొదిలేయలేమని నాని అన్నారు.- మరోవైపు ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామనేది పూర్తిగా అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు. – ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే విషయం ప్రతిపక్షం చెబితే.. రాజధానిలో ఆ వర్గానికే ప్రాధాన్యతనిచ్చారని చంద్రబాబే రాజముద్ర వేసినట్టు కాదా..? అని కొడాలి ప్రశ్నించారు. -ఒక కులాన్నో, మతాన్నో, పార్టీనో దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్ జగన్ పనిచేయటం లేదు. 13 జిల్లాలు మాకు సమానమే అని నాని తెలిపారు. – పోలవరం, అమరావతితో పాటు మారుమూల అభివృద్ధికి దూరంగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు కూడా అంతే అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం ఉద్దేశం అని కొడాలి నాని స్పష్టం చేశారు. – రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలను కూడా ఎలా అభివృద్ధి చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని కొడాలి నాని తెలిపారు. – చంద్రబాబులా బుద్ధి తక్కువ పనులు చేయం. చంద్రబాబులా జనాలు తిరస్కరించే పరిస్థితి తెచ్చుకోమని మంత్రి కొడాలి నాని తెలిపారు.ప్రజలు తినే నాణ్యమైన బియ్యం పేదలకు ఇస్తాం..- ప్రజలకు తినేవిధంగా నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు. సన్నబియ్యం అంటే పలావు బియ్యం, బాస్మతి బియ్యం ఇచ్చే లభ్యత మనవద్ద లేదు. సన్న బియ్యమని మేము ఎక్కడా చెప్పలేదు. స్వర్ణా, బీపీటీ వంటి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.- పీడీఎస్ ద్వారా సేకరించిన బియ్యంలో మనకు 27లక్షల టన్నులు సరిపోతాయి. అయితే, ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం నుంచి పేదలకు రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నాం.