సీఎం కేసీఆర్ రేపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా కరివెన వెళ్లనున్న సిఎం పట్టెం, నార్లపూర్, ఏదుల జలాశయాలను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సిఎం సమీక్షించనున్నారు. పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీయనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు . సీఎం పర్యటనలో కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని మండి పడ్డాడు. పాలమూరు పచ్చబడాలన్నదే సిఎం సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులతో కలిపి 22 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలన్నదే కెసిఆర్ లక్ష్యమన్నారు.