ఏపీ సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే అభివృద్ది కేంద్రీకృతం కావడంతో ముఖ్యంగా హైదరాబాద్ మినహా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మళ్లీ పాత స్టైల్లోనే అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నించాడు. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ది అంతా అమరావతిలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధిని అందించేలా ఏపీలో నాలుగు ప్రధాన నగరాలను రాజధాని తరహాలో డెవలప్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలులో , వైజాగ్‌లలో హైకోర్ట్, హైకోర్ట్ బెంచ్‌ల ఏర్పాటు, విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప నగరాలను రాజధానులుగా డెవలప్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న దొనకొండను పారిశ్రామిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. టీడీపీ నేతలు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే వూరుకోం అంటూ శపథాలు చేస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో వేలాది ఎకరాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారు. ఒక వేళ సీఎం జగన్ నాలుగు రాజధానులు చేసి, అభివృద్ది వికేంద్రీకరణ చేస్తే అమరావతిపై హైప్ తగ్గుతుంది. దీంతో తాము నష్ట పోతామని గ్రహించిన చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధాని అంశాన్ని వివాదస్పదం చేసి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారు.
అయితే రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు కూడా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఆమరణ దీక్ష చేస్తాం అంటూ ప్రకటనలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీ అభివృద్ది అంతా విస్తరిస్తే రాయలసీమ డెవలప్ అవుతుందని కొంత మంది టీడీపీ నేతలు సంతోషిస్తున్నా…చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు మాత్రం అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం చేయాలని గగ్గోలు పెడుతున్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి మేము వ్యతిరేకం అని డైరెక్ట్‌గా చెప్పలేక ఉత్తరాంధ్రకు చెందిన దొనకొండను అడ్డం పెట్టుకుని అమరావతి పాట పాడుతున్నారు.
తాజాగా అనంతపురం మాజీ మంత్రి పరిటాల సునీత అమరావతికి జోలికివస్తే తాను ఆమరణ దీక్ష చేస్తానని స్వయంగా రాయలసీమ గడ్డ మీద మడకశిరలో ప్రకటించారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన రాయలసీమ గురించి ఆలోచించకుండా..అమరావతి గురించి ఆమరణ దీక్ష చేస్తానని పరిటాల సునీత ప్రకటించడం పట్ల రాయలసీమ వాసులు విస్తుపోతున్నారు. రాయలసీమ అభివృద్ది కంటే తన సామాజికవర్గం ప్రయోజనాలకే పరిటాల సునీత ప్రాధాన్యత ఇస్తుందని సీమవాసులు అంటున్నారు. గతంలో అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు తరలించుకుపోయినప్పుడు కూడా ఇదే తరహాలో సునీతమ్మ మాట్లాడి ఉంటే ఆమెకు గౌరవం ఉండేది…అప్పుడు సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నా మౌనంగా ఉండిపోయి..ఇప్పుడు రాయలసీమ డెవలప్ అవుతుంటే…అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తా అని ప్రకటించడంపై సీమ ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిటాల సునీత అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించడం పట్ల సీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.