ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందేనని.. ఇక నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ..బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అమరావతిని నుంచి వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందంటూ టీడీపీ , ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. కానీ సీఎం జగన్ మాత్రం అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…మరొకొన్ని నగరాలను ఇండస్ట్రియల్, ఐటీ రాజధానులుగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా రాజధాని అంశంపై బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అమరావతిని నుంచి రాజధాని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా మరో బీజేపీ ఎంపీ రాజధాని అంశంపై స్పందించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ…నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని చెప్పిన ఆయన ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని కూడా పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలిపిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీజీ. ఇక రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశమే లేదని, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎంలను జగన్ నియమించారని టీజీ చెప్పుకొచ్చారు. అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామంటూ జగన్ ఎన్నికలకు వెళ్లారని అలాంటప్పుడు రాజధాని మారే అవకాశం ఉందని టీజీ కామెంట్ చేశారు.
జగన్ కమిట్‌మెంట్ నమ్మి ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఇప్పటికీ ఆయన నమ్మక ద్రోహం చేయరని చెప్పొచ్చని టీజీ అన్నారు. , జగన్ మొండి మనిషి కాబట్టి ఆ స్టాండ్‌నే కొనసాగిస్తారన్నది తన అభిప్రాయమని టీజీ ఖరాఖండిగా చెప్పారు. ఎవరేం చెప్పినా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే స్వాతంత్ర్యం జగన్‌కు ఉంటుందన్నారు. అధికార పార్టీ వైసీపీ ఆలోచన ప్రకారం నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ టీజీ అభిప్రాయపడ్డారు. మొత్తంగా అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే…ఇక నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాలో సంచలనంగా మారాయి.టీజీ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.