గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అప్పుడే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో అధికారుల మ్యానేజ్ చేసారు. దీంతో ఆయన నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై అప్పుడూ యరపతినేనిపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని ఆదేశించగా సున్నపురాయి నిక్షేపాల అక్రమ మైనింగ్‌కు సంబంధించి అప్పట్లో వైసీపీ తరఫున ఓనిజనిర్ధారణ కమిటీ పల్నాడులో పర్యటించేందుకు ప్రయత్నించింది. కానీ వారిని యరపతినేని అనుచరులు అప్పట్లో అడ్డుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, యరపతినేని అరెస్ట్ ను ముందే ఊహించారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే, మరో కోర్టులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇటీవల యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ నివేదిక ద్వారా అర్థమవుతోందని, ఆయన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్లు అనుమానాలున్నాయని అంది. పెద్దఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించడం పట్ల త్వరలోనే ఆయన అరెస్ట్ తప్పదని స్పష్టమవుతోంది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.