ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ ఫోర్ నొజోమి ఒకుహార (జపాన్)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది. బాసెల్‌లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ అవార్డును తన తల్లి బర్త్‌డే సందర్భంగా ఆమెకి అంకితం చేస్తున్నానని, హ్యాపీ బర్త్‌డే మామ్ అంటూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించింది.
పీవీ సింధూ కోర్టు నుంచి బయటకు నడచివస్తుండగా ప్రేక్షకులు హ్యాపీ బర్త్‌డే అంటూ ఆమె తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2017, 2018లో సింధూ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ఫైనల్‌కు వచ్చినా కీలక మ్యాచ్‌ల్లో ఓటమితో రెండోస్ధానంతో సింధూ సరిపెట్టుకున్నారు. మూడోసారి ఫైనల్ ఫోబియాను అధిగమించి సింధూ సత్తా చాటడంతో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశం కోసం తాను ఈ విజయాన్ని ముద్దాడానని సింధూ సగర్వంగా చాటారు.