ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలోనూ మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు కక్షగట్టటారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినందుకు తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి ఏడాది ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. అలాగే విశాఖలో నిర్వహించిన మహిళా పార్లమెంటరీ సమావేశానికి తనను రాకుండా అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధికారులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో నారాయణ కాలేజీల్లో విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎక్కడైతే ఆడవాళ్లను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారని నమ్మిన వ్యక్తి జగన్ అన్నారు. డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళకు అవకాశం కల్పించారని, ఆడవారిపట్ల ఆయనకున్న గౌరవాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. జగన్ ఎస్సీ మహిళలను ఇద్దరిని మంత్రులుగా చేశారని గుర్తు చేసారు. వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేశారని, గత పార్టీలు ఆమెకు ఏ పదవీ ఇవ్వకుండా అన్యాయం చేశారని, జగనన్న పార్టీకోసం పనిచేసిన వారిని మరిచిపోలేదన్నారు. జగన్‌కు తామంతా అండగా ఉంటామని, సీఎంకు మంచిపేరు తీసుకొస్తానమన్నారు. మహిళా కమిషన్ పేరు వింటే చింతమనేని లాంటోడికి తడిసిపోవాలని, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.
