తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం రాజకీయంగా పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారానికి ఎలా అనుమతి ఇస్తుందంటూ…టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెట్టాయి. అయితే ఈ టికెట్లు తిరుపతికి ఎలా వచ్చాయి అనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయగా…అసలు నిజాలు బయటపెట్టాయి. అసలు ఈ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ చేపట్టిందని…ఇప్పుడు ఆ టికెట్లే నెల్లూరు నుంచి తిరుపతికి చేరాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం బస్సు టికెట్లకు సంబంధించి టిమ్ రోల్స్ పంపిణీ వెనుక టీడీపీ సానుభూతిపరులైన అధికారుల పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఇద్దరు ఆర్టీసీ హౌజ్‌లో కీలక అధికారులు కాగా మరొకరు నెల్లూరు స్టోర్స్ అధికారి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అందిన సూచనల మేరకే తిరుమలకు ఈ రోల్స్ పంపినట్లు స్టోర్స్ అధికారులు పేర్కొనడం గమనార్హం. మైనార్టీ సంక్షేమ పథకాలతో ఉన్న ఈ టిమ్ రోల్స్‌ను అన్నీ తెలిసే తిరుమలకు పంపించారని దీన్ని బట్టి రూఢీ అవుతోంది. ఒక్కో టిమ్ రోల్ ఖరీదు రూ.6 కాగా 30 వేల టిమ్ రోల్స్ నెల్లూరు స్టోర్స్‌లో ఉన్నాయి. వీటి ఖరీదు రూ.1.80 లక్షలు. గత ప్రభుత్వం ముద్రించిన ఈ టిమ్ రోల్స్‌ను పక్కన పడేయకుండా తిరుమలకు పంపించేలా టీడీపీ రచించిన కుట్రలో అధికారులు పావులుగా మారినట్లు పేర్కొంటున్నారు.
అధికారికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆయన చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి అండదండలున్నాయని, టీడీపీ పెద్దల మెప్పు కోసమే బస్సు టికెట్ల వివాదానికి వీరిద్దరు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు పథకాలతో కూడిన టిమ్ రోల్స్‌ను జూన్ 18 తర్వాత పంపిణీ చేయడాన్ని బట్టి పథకం ప్రకారమే చేశారని తెలుస్తోంది. టీడీపీ కుట్రలో భాగంగానే నెల్లూరుకు చెందిన ఆర్టీసీ అధికారి అన్య మత ప్రచారానికి సంబంధించిన టికెట్లను తిరుమలకు తరలించినట్లు రూఢీ అయింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తిరుమలకు అన్యమత ప్రచారానికి సంబంధించిన టికెట్లను తరలించిన సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశించదని సమాచారం. అంతే కాదు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా టీడీపీ ఆఫీసు నుంచే కుట్ర జరిగిందా…కావాలనే టీడీపీ సానుభూతిపరులైన అధికారులు తిరుమలకు అన్య మత ప్రచారానికి సంబంధించిన టికెట్లు తరలించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తంగా టీడీపీ పెద్దల మెప్పు కోసమే….టికెట్లు తరలించి సదరు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని బద్నాం చేశారని తెలుస్తోంది. త్వరలోనే అన్ని నిజాలు బట్టబయలు కానున్నాయి.