మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ లో ఆదివారం ఉదయం మత్స్యకారుల వృద్ధి కోసం మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వంచే వంద శాతం సబ్సిడీతో ఉచితంగా 1లక్షా 20వేల చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మత్సకారుల అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అన్నీ చెరువుల్లో చేపలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో నియోజకవర్గంలో ఒకటి, రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీతో పంపిణీ చేసేవారని, ఈ ఏటా సరైన వర్షాలు కురవక చెరువుల్లో నీరు లేక చేపలు పంపిణీ ఆలస్యమైందని వివరిస్తూ.. మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లలను ఉచితంగా వదులుతున్నట్లు వెల్లడించారు. సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో 138 చెరువుల్లో రూ.56.40లక్షల రూపాయలతో సబ్సిడీ సైతం ప్రభుత్వమే భరిస్తూ మత్స్యకారులకు రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ యేట ఉమ్మడి మెదక్ జిల్లాలో అనుకున్న వర్షాలు బాగా లేక చెరువులో నీళ్లు చేరలేదని, మత్స్యకారులు నిరాశ పడొద్దని కోరారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు వచ్చాయని, రాబోయే నెలలో అంతగిరి, రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రానున్నాయని చెప్పారు. ఆ నీళ్లతో కాలువలు, గొలుసు కట్టు చెరువులు, ఊర్లో, పల్లెల్లోని చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. వర్షాలు లేవని, నీళ్లు రాలేదని మత్స్యకారులు ఆందోళన పడొద్దని, నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెరువులో వదిలే చేప పిల్లలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇక ముందు మత్స్యకారులకు మంచి రోజులేనని, ఈ దసరా పండుగలోపు జిల్లాలోని అన్నీ చెరువులు నింపుతామని తెలిపారు. మొగులుకు మొఖం పెట్టి చూసే రోజులు ఇక ఉండవని, కాళేశ్వరం జలాలు ఇప్పటికే మిడ్ మానేరుకు చేరాయని, వచ్చే నెల రోజుల్లో అంతగిరి, రంగనాయక సాగరుకు గోదావరి నీళ్లు వస్తాయని.. ఆ నీళ్లతో ప్రతియేటా చెరువులు, కాల్వలు, కుంటలు అన్నీ నింపుతామని పేర్కొన్నారు. దళారులను నమ్మి మత్స్యకారులు మోసపోవద్దని, మత్స్యకారులే స్వయంగా వ్యాపారం చేయాలని, సిద్ధిపేటలో మీకు అనువుగా చక్కటి ఆధునాతన చేపల మార్కెట్ ఉన్నదని, సిద్ధిపేట చేపల మార్కెట్లో చేపలను ఎక్కువగా కొంటున్నారని, ఇక్కడికి వచ్చిన చేపలు నాణ్యమైనవని ఎక్కువగా తింటున్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో చేపలకు మంచి మార్కెట్ ఉన్నదని, హైదరాబాదు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని.., మీకు మీరే మీ చేపలను మార్కెటింగ్ చేసుకోవాలని మత్స్యకారులకు మార్కెటింగ్ ట్రిక్స్ చెప్పారు.
మత్సకారులు దళారులను ఆశ్రయించొద్దని, మీరే వ్యాపారం కూడా చేసుకుని మీ కాళ్ల మీద మీరు నిలబడాలంటూ.. మీకు కావాల్సిన ఆటోలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ మేరకు పట్టణంలోని చింతల్ చెరువులో 54వేల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారిక యంత్రాంగం, మత్స్యకారుల సంఘ నాయకులతో కలిసి వదిలినట్లు, అదే విధంగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి గారిచే 1లక్షా 80వేల చేప పిల్లలను చెరువుల్లోకి వదులుతున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు పొన్నాల నర్సింలు, డైరెక్టర్ అక్కారపు సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.