ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకే సైలేజీ (మాగురు) గడ్డి పంపిణీ చేయడం ఈ సంస్థ ముఖ్యద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి , శుద్ధి చేసి కార్బొహైడ్రేట్‌లను సేంద్రీయ ఆమ్లాలుగా మార్పు చేసి, పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కోడెల కూతురికి చెందిన ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశుసంవర్ధక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు, ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు కోడెల కూతురు విజయలక్ష్మీ పథక రచన చేసింది.
అయితే నిబంధనల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధన మారుస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సైలేజీ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరువు పనుల కింద ఇచ్చేది. అయితే పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడటానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపుగా తయార చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ కలుపుకుంటే కిలోకు రూ. 9 నుంచి రూ.11 వరకు ప్రభుత్వం పశుసంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్దిదారుడు భరించాల్సింది కిలోకు రూ. 2 / మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీకుమార్, డైరెక్టర్ సోమశేఖర్ రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి, 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017- 18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్లు లెక్కలు చూపించి..
కోట్లాది రూపాయలు కాజేసినట్లు సమాచారం. అయితే తమకు ఇంకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖకు సాయి కృప సంస్థ లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో అప్పనంగా గడ్డి పంపిణీ పేరుతో కోట్లు కొల్లగొట్టిన వైనం బయటపడింది. లబ్దిదారుడు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల కుమార్తె ఆయా గ్రామాల్లో అనుచరులతో కట్టించి, ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసేవారని సమాచారం. మొత్తంగా రైతులకు సైలేజీ గడ్డి పంపిణీ పేరుతో కోట్లు నొక్కేసిన కోడెల కుమార్తె విజయలక్ష్మీ బాగోతం బయటపడింది. దోపిడీకి కాదేది కనర్హం అన్నట్లుగా కోడెల ఫ్యామిలీ పశువుల గడ్డి పేరుతో కోట్లు తినేసిన వైనంపై గుంటూరు జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు.