ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్‌లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్మీట్లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తామంటూ బొత్స ఎక్కడా చెప్పలేదు. అయితే టీడీపీ, ఎల్లోమీడియా మాత్రం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తున్నారంటూ సీఎం జగన్‌పై దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయితే రాజధానిగా అమరావతి ఏపీ ప్రజల సెంటిమెంట్‌గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి సముఖంగా లేరన్నట్లు సమాచారం. కాని పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పరిపాలన, ఇండస్ట్రీస్ అన్నీ రాజధాని హైదరాబాద్‌లోనే పెట్టారు. దీంతో తెలంగాణతో సహా ఆంధ్ర, రాయలసీమలోని ప్రాంతాలన్నీ అభివృద్ధిలో వెనుకబడి పోయాయి. అందుకే ప్రాంతీయ అసమానతలు తలెత్తాయి. అందుకే సీఎం జగన్ ఈసారి ఆ పొరపాటు చేయదల్చుకోలేదని సమాచారం. పరిపాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ దృష్టి పెట్టారని…అమరావతితో సహా రాయలసీయ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర..ఇలా అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారని..వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి.
అమరావతిని ప్రధాన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే ఏపీలోని మరో ప్రధాన నగరాన్ని ఇండస్ట్రియల్ కమ్ ఐటీ క్యాపిటల్‌గా రూపొందించడానికి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రియల్ కమ్ ఐటీ క్యాపిటల్‌గా ప్రధానంగా హనుమాన్ జంక్షన్, నూజివీడు, వినుకొండ, దొనకొండ, నందిగామ తదితర నగరాలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో హనుమాన్ జంక్షన్, నూజివీడు, నందిగామ పట్టణాలన్నీ అమరావతికి సమీపంలో ఉన్నాయి… కాబట్టి దొనకొండలోనే ఇండస్ట్రియల్ కమ్ ఐటీ క్యాపిటల్‌గా పెడితే మంచిదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కాగా దొనకొండను ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా చేసి, వైజాగ్‌ను ఐటీ క్యాపిటల్ చేస్తే మంచిదని, అప్పుడు ఉత్తరాంధ్రతో సహా అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయని మరి కొందరు అంటున్నారు. అయితే దొనకొండ అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా సమీపంలో ఉంది. కనుక అక్కడే ఐటీ, ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని పారిశ్రామికవర్గాల వాదన. శివరామకృష్ణన్‌కమిటీ కూడా దొనకొండ ఏపీ రాజధానిగా అనువైనదని నివేదిక ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన నగరాన్నే ఐటీ, ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా, సీఎం జగన్ త్వరలో అధికారికంగా ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. మరి ఐటీ, ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా సీఎం జగన్ ఏ నగరాన్ని ఎంపిక చేస్తాడో చూడాలి.