నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కమలం పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు దివంగత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. అభిమానుల, కార్యకర్తల సందర్శనార్థం జైట్లీ పార్థివదేహాన్ని ఈ మధ్యాహ్నం వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. జైట్లీ పార్థివదేహాన్ని అందంగా అలంకరించిన వాహనంలో అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. యమునా నది ఒడ్డున గల నిగమ్‌బోధ్ శ్మశాసవాటికకు తరలించారు. దారి పొడవునా జట్లీ జీ అమర్ రహే… లాంగ్ లీవ్ జైట్లీ జీ అంటూ అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు చివరిసారిగా జైట్లీకి కన్నీటి వీడ్కోలు పలికారు. న్యాయశాస్త్ర కోవిదుడిగా , నిబద్దత కలిగిన రాజకీయవేత్తగా అరుణ్ జైట్లీ దేశానికి అందించిన సేవలు నిరుపమానం.నీతి, నిజాయితీ, విలువలు పాటించిన రాజకీయ నేతగా, పెద్దనోట్ల రద్దు, జీయస్టీ లాంటి విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన దార్శనికుడిగా అరుణ్ జైట్లీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. లాంగ్ లివ్ జైట్లీ జీ..!