బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఈ నెల 9వ తేదీ నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.