టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు . నెల్లూరు జిల్లాలోని పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మేదరమెట్ల రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. స్పెషల్ బ్రాంచి పోలీసులు సమాచారం మేరకు మేదరమెట్ల పోలీసులు నిషేధిత ఖైనీ ఉత్పత్తుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారం అంతా ఓ టీడీపీ నేత గోడౌన్లో మూడేళ్ల నుంచి గుట్ట చప్పుడు కాకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. చివరకు రూ.3 కోట్ల విలువైన ఖనీ తయారీ ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్ కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పోకూరి హనుమంతురావుకు చెందిన మౌనిక పొగాకు గోడౌన్‌ను రెండేళ్ల కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని నిఖిత పొగాకు కంపెనీగా పేరు మార్చుకొని నిషేధిత ఖైనీ తయారు చేసే కేంద్రంగా మార్చాడు. ఈ క్రమంలో గోడౌన్లో పొగాకు కంపెనీ పేరుతో ముడి సరుకులను తెచ్చి ఖైనీ ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రం నలుమూలలకు విక్రయిస్తున్నారు. స్పెషల్ బ్రాంచి హెడ్‌కానిస్టేబుల్ జిలానీ సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ అశోకవర్థన్, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణలు తమ సిబ్బందితో ఖైనీ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారైనట్లు తెలుసుకున్నారు. గోడౌన్ షట్టర్ల తాళాలు పగులగొట్టి పరిశీలించగా రూ.3 కోట్ల విలువైన ఖైనీ తయారీకి వినియోగించే ముడు సరుకు, యంత్రాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్ యజమాని పోకూరి హనుమంతురావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
