ఏపీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్చలు చేపడుతున్నారు. విజయవాడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంలోని ప్రజావేదికతో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం లింగమనేని గెస్ట్‌హౌస్‌కు నోటీసులు ఇచ్చిన అధికారులు కరకట్ట ప్రాంతంలో మరి కొన్ని అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్క అమరావతిలోనే కాదు విశాఖలో కూడా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటోంది. తొలుత విశాఖ నగరానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్‌కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. తాజాగా భీమిలిలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు చెందిన క్యాంపు కార్యాయం అక్రమ నిర్మాణం అని జీవీఎంసీ తేల్చింది. దీంతో గంటా తన క్యాంపు కార్యాలయాన్ని 24 గంటల్లో కూల్చివేయాలని, లేదంటే తామే కూల్చి వేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో గంటా క్యాంపు ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. వాస్తవానికి భీమిలీలోని క్యాంపు కార్యాలయానికి భవన నిర్మాణ అనుమతులు లేవని జీవీఎంసీ గతంలోనే తెలిపింది. సీఆర్‌జెడ్‌లో నిర్మించారంటూ అప్పటి ఇంటి యజయాని కంచర్ల రవీంద్రనాథ్ పేరుతో నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ఇదే భవనం గంటా కుమార్తె సాయి పూజిత పేరుతో రిజిష్టర్ అయింది. దీంతో మళ్లీ అధికారులు కూల్చివేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. అయితే కూల్చివేతకు వారం రోజుల గడువు ఇవ్వాలంటూ హైకోర్ట్ స్టే ఇచ్చింది. మొత్తంగా బాబు ప్రజావేదికతో మొదలైన అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం విశాఖలో కూడా సాగుతోంది. మరి గంటా తన క్యాంపు కార్యాలయాన్ని కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా..అధికారులు నిబంధనల ప్రకారం గంటా క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేస్తారా అన్నది చూడాలి.