టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అల్లుడికే చెందిన ఆస్పత్రిలో చేరారాయన. ఐసీయూలో ప్రస్తుతం కోడెల ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కోడెల కోలుకున్నారని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా ఈ విషయం గుప్పుమనడంతో పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో తాను ఆ ఫర్నీచర్ ఇచ్చేస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్టు కోడెల తప్పించుకునే మార్గాలు వెతికారు. అత్యంత భద్రత కలిగిన గౌరవప్రదమైన అసెంబ్లీ నుంచి ఫర్నీచర్‌ను కోడెల ఎలా తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కోడెలకు ఇలా చాతీ నొప్పి రావడానికి కారణం ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఇలా దొంగతనం కేసు తన మెడకు చుట్టుకోవడంతో కోడెల ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రయత్నించి ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు.
