విపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారంలో ఉన్నపుడు మరోలా మాట్లాడటం అలవాటుగా మారిన ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్ట అమలు ను నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎలా చెప్పడానికి లోకాయుక్త సవరణ చట్టం ఉదాహరణ. తాను అధికారంలోకొస్తే పారదర్శక పాలన అందిస్తానని, ప్రజలకు జవాబుదారీగా ఉంటానని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలన అందిస్తానని ప్రమాణస్వీకారం రోజునే చెప్పారు. అధికారం వచ్చిన మరు క్షణమే వాగ్దానాలన్నీ గాలికొదిలే దుష్ట సంస్కృతి రాజ్యమేలుతున్న ఈ కాలంలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అదే వేదికపై చూపుతూ దాన్ని తాను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తానని ప్రకటించారు. అయిదేళ్లుగా రాష్ట్రాన్ని చుట్టుముట్టిన అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో ఆరోజే జగన్ వెల్లడించారు. టెండర్లలో పారదర్శకత ప్రవేశపెడతామన్నారు. అవినీతికి కాస్తయినా చోటీయని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు.
ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ఆ వరసలో తదుపరి చర్యగా భావించాలి. ఏపీలో లోకాయుక్త వ్యవస్థకు చంద్రబాబు తన తూట్లు పొడిచారు. ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లోకాయుక్త పదవికి అర్హులన్న నిబంధన అడ్డు పెట్టుకుని ఆరెండు కేటగిరీల్లోనివారూ లభ్యం కావడంలేదని సాకు చెప్పి లోకాయుక్త నియామకం జోలికే బాబు పోలేదు. అమలులో సమస్యలుంటే వాటిని అధిగమించడానికి ఏంచేయాలో ఆలోచించాలే కానీ తనకు తోచకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి. అంతేకానీ బాబు ఈరెండూ చేయలేదు. అలాగే తన కుమారుడు లోకేష్‌ను తోడు తెచ్చుకున్నారు. వెరసి ఏపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జగన్ తీసుకొచ్చిన సవరణ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రమే. ఎవరి ఫిర్యాదులనైనా విచారణకు స్వీకరిస్తుంది. అవినీతి, అక్రమాలపై వివిధ మాధ్యమాల్లో వచ్చే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఊరూ పేరూ లేకుండా రాసే ఉత్తరాలకు సైతం విలువనిచ్చి విచారణ జరిపిస్తుంది. అవినీతిని అంతం చేయడానికి చేతలు అవసరం. ఒక్క రూపాయి ప్రజాధనం దుర్వినియోగం కానీయకూడదనే సంకల్పం పాలకులకు ఉన్నప్పుడే ఆదర్శం అట్టడుగు స్థాయి వరకూ విస్తరిస్తుంది. అందుకే లోకాయుక్త సవరణచట్టం నోటిఫై చేయడం కచ్చితంగా ప్రశంసించదగ్గ చర్య.. ఇక నియామకం ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తై కర్తవ్య నిర్వహణకు పూనుకుంటుందని ఆశించాలంటున్నారు నిపుణులు.