తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ప్రకటనల్లో గత నాలుగేళ్లలో ముస్లింలకు, క్రిస్టియన్లకు ప్రభుత్వం ఏంచేసిందో వివరిస్తూ అచ్చు వేశారు. టిన్ మిషన్ ద్వారా ఇస్తున్న ఈ టికెట్ల వెనుకభాగంలో ప్రకటనలను ముద్రించారు. ఆ పేపర్ రోల్స్ ఇప్పుడు వాడడంతో దుమారం చెలరేగింది. ఈ ప్రకటనలు జగన్ ప్రభుత్వంలోనే ముద్రించారని భావించారు. కానీ అవి చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలోనే వాటిని ముద్రించి ఉంటే నాలుగున్నరేళ్లలో అని ఎందుకు చెప్తారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే కదా దాటింది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే 2018లో దాదాపుగా 60వేల టిన్ పేపర్లపై ఈ ప్రకటనలు ముద్రించింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పొరపాటు జరిగిందని దాన్ని సరిచేస్తామని వెల్లడించింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతప్రభుత్వం చేసిన ఘనకార్యాలను ప్రచారం చేసుకునేందుకే ఆర్టీసీ టికెట్లను మార్చిలో ముద్రించిందని, అప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో వాటిని పక్కనపెట్టి ఇప్పుడు వాడారన్నారు. సీఎం వైయస్ జగన్ తో చర్చించి విచారణ జరిపిస్తున్నామన్నారు. కచ్చితంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
