ఏపీలో చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలను ప్రతిపాదించింది. అందులో భాగంగా.. కొత్త మద్యం విధానంలో చల్లని బీరు అమ్మకాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ప్రభుత్వ మద్యం షాపుల్లో బీరు బాటిళ్లను కూల్ చేసే ఫ్రిడ్జ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దీంతో ఇకపై లిక్కర్ తరహాలోనే బీర్లు కూడా కూలింగ్ లేకుండా వినియోగదారులకు విక్రయిస్తారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామనే హామీ అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు.