వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. వరదలపై కూడా చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వరద నీటిని వదిలేసి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరుండేది కాదన్నారు. వరదనీటిని కిందకు వదిలిఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామనన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో వరద నీటిని నిల్వ చేసుకోగలిగిందన్నారు. చంద్రబాబు అబద్ధాలు పదే పదే చెప్పారని, జులై 29నాటికల్లా మొత్తం 419టీఎంసీలు మూడు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉందని, ఆగస్టు 3కల్లా శ్రీశైలానికి వరదవస్తే 6వతేదీ నాగార్జున సాగర్‌కు నీటిని వదిలారని ఆయన చెప్పారు. శ్రీశైలానికి వచ్చిన 890 టీఎంసీల వరద నీటిని చంద్రబాబు చెప్పినట్లుగా 580 టీఎంసీలు నింపుకున్నా దాదాపు 300 టీఎంసీలుపైగా ఉంటాయంటూ లెక్కలతో సహా వివరించారు. చంద్రబాబు శ్రీశైలానికి వచ్చిన వరదను వెంటనే వదిలిఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారని గుర్తుచేశారు.
ఆగస్టు 3వ తేదీ నుంచి సీడబ్ల్యూసీ వివరాలు మీడియా ముందు ఉంచారు. శ్రీశైలం జలాశయం నీటినిల్వ 886 అడుగులు ఉండాలనన్నారు. జూరాల, అల్మట్టి డ్యామ్‌లు ఒక హెచ్చరిక బోర్డు పెట్టుకొని దిగువకు నీటిని వదులుతారని, 9వ తేదీన 878 అడుగులు నిండిన తరువాత శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామన్నారు. నాగార్జున సాగర్ నుంచి 546 అడుగులు దాటిన తరువాత నీటిని వదలాల్సి ఉందన్నారు. అందుకే 12వతేదీ ఉదయం నాగార్జున సాగర్ నుంచి నీటిని వదిలామన్నారు. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు నీరు రాకముందే 12800 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. 13వ తేదీన ప్రకాశం బ్యారేజి గేట్లను ఎత్తామన్నారు. గత ఎనిమిది రోజుల పాటు దాదాపు 8 లక్షల శ్రీశైలం నుంచి విడుదల చేశామన్నారు. రెండురోజులు మాత్రమే 7 లక్షల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. గండికోట నుంచి రేపు నీటిని విడుదల చేయబోతున్నామని, సోమశిలలో 13టీఎంసీల నీరు ఉందన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు కనిపిస్తున్నాయో లేదో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా గతంలో పని చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రకాశం బ్యారెజీలో 3టీఎంసీలు ఉండగా 6 టీఎంసీలు ఉంచారని చంద్రబాబు అన్నట్టు తెలిపారు. దాదాపుగా 7లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన తరువాతే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎక్కి ప్రవహించిందన్నారు. దాన్ని నిల్వ చేయడం అని ఎలా అంటారంటూ నిలదీసారు.