తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. మా పథకాలపై పడి ఏడుస్తున్నారంటూ బీజేపీపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఏడవడం, విమర్శలు చేయడం కాకుండా దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు సైతం అనేకసార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. జాతీయ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కనిపిస్తుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మాత్రం అవినీతి కనబడుతుందా అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సైతం సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంటే అవగాహనా లోపంతో కుంభకోణాలు జరిగాయంటూ పదేపదే విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.