తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ఏంజరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి టీడీపీ ఒడ్డుతుందన్నారు. కొన్ని టీవీ ఛానళ్లు, వ్యక్తులు కూడా ఈ వ్యవహారాన్ని రాజేస్తున్నారన్నారు. దురుద్దేశ పూర్వక ప్రచారం ద్వారా శ్రీవారి భక్తుల మనస్సులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. విషప్రచారానికి పాల్పడుతున్న మీడియాసంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టప్రకారం నడుచుకుంటామన్నారు. గతంలో 40దేవాలయాలను కూలగొట్టించి, సదావర్తి భూములు కాజేసింది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్రపూజలు చేయింనది గత తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. హిందుత్వం మీద చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు అన్ని దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందుకే జగన్ గారు అందరి మనిషి అయ్యారన్నారు. అలాగే జగన్ కు చెడ్డ పేరు తెచ్చేలా RTC లో కొంతమంది చంద్రబాబు అనుకూల అధికారులు పని చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శిస్తున్నారు.
