రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లాస్టిక్ బాటిల్ల వాడకంపై నిషేధం విదించారు. అయితే, కొందరు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత , జౌళి శాఖ అధికారులతో ఎమ్మెల్యే కేటీఆర్ రివ్యూ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ సిబ్బంది ఈ సమావేశంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్.. ఆ వాటర్ బాటిళ్లను తీసేయించారు.
సమావేశంలో ప్లాస్టిక్ బాటిల్లను ఉపయోగించడాన్ని గమనించిన కేటీఆర్ వాటిని తన చేతుల్లోకి తీసుకుని వీటిని తొలగించాలని ఆదేశించారు. అక్కడ ఉన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు సైతం ఈ విషయం చెప్పి అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. “ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎంకరేజ్ చేయకండి. మీరు ప్లాస్టిక్ బాటిళ్లను వాడి మమ్మల్ని చెడ్డోళ్లను చేస్తున్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అందరికీ చెప్పండి. ప్లాస్టిక్ ను ఎంకరేజ్ చేయొద్దు. ఎవరో చేశారని మిగతావాళ్లు కూడా అదే చేయడం రైటా.. అందరికీ చెప్పండి.. ప్లాస్టిక్ బాటిళ్లు వాడకుండా చూసే బాధ్యత మీదే” అని కేటీఆర్ అధికారులకు స్పష్టం చేశారు.