తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలువురు నాయకులు కోడెల శివప్రసాద్ చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పని చేయడం ఎంత మాత్రమూ సమర్థించదగ్గ విషయం కాదని అంటున్నారు. తమ పార్టీ నాయకుడే అయినప్పటికీ.. ఆ పని ఎవరు చేసినా తప్పు తప్పేనని చెబుతున్నారు. దీనిపై మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తన గళాన్ని వినిపించారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారిందన్నారు. అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించారు. కోడెల అలా చేయకుండా ఉంటే బావుండేదన్నారు. ఎవరిని అడిగి ఫర్నిచర్ తీసుకెళ్లారని.. అసెంబ్లీ కార్యదర్శికి చెప్పి తీసుకెళ్లారా..? అని ప్రశ్నించారు.
