తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ఈక్రమంలో పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని నిర్మాణం, వరదల పరిస్థితులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం పెరిగింది. ఇదంతా సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నపుడు జరిగింది. టీడీపీ నేతలు వరుస విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది. అయితే తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకరకంగా టీడీపీ పునాదులు కదిలిపోయే వార్త ఇది.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే టీడీపీ పార్టీ నుండి దాదాపుగా 10మందికి పైగా ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాల సంగతి మాట్లాడుదాం అంటున్నారని, ప్రస్తుత జగన్ మేనియాలో కచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్లినా గెలిచేస్తామంటున్నారు. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన విషయాన్ని గుర్తుచేస్తూ జగన్ గనుక అంగీకరిస్తే 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరుతారన్నారు. తనఇంటిని కూల్చివేయాలనే కుట్రలో భాగంగానే కృష్ణా నది వరదలను కృత్రిమంగా సృష్టించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను కూడా అవంతి ఖండించారు. కృత్రిమ వరదలనే కొత్త పదాన్ని చంద్రబాబు సృష్టించారని, జగన్ సరిగ్గా దృష్టి పెడితే టీడీపీ అంతా కూడా ఖాళీ అవుతుందన్నారు. కావాలనే జగన్ అలాంటి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి టీడీపీ పాట పాడుతున్నారని అంతా చంద్రబాబు ప్లాన్ లా అనిపిస్తుందన్నారు. సుజనా చౌదరి ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారనేది తెలుసుకోవాలన్నారు. అలాగే జనసేన పార్టీ తరపున గెలిచిన రాపాక కూడా గతంలోనూ వైసీపీ టికెట్ కు ప్రయత్నించారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేకు కూడా సరైన గౌరవం ఇవ్వకపోవడం, జగన్ పాలన బావుందని స్వయంగా రాపాకే ప్రకటించడం, పవన్ లో ఇప్పటికీ మార్పు రాకపోవడం, అనుచరుల ఒత్తిడి, నియోజకవర్గ అభివృద్ధి వంటి కారణాలతో ఆయన కూడా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
