గతంలో యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు పలువురు హాజరయ్యారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 1991- 2019 మధ్య దాదాపు 3 దశాబ్దాలు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ దఫా అసోం నుంచి అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి పోటీచేశారు మన్మోహన్ సింగ్.
దాదాపు మూడు దశాబ్దాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ 2004- 14 మధ్య రెండు దఫాలు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ ఏడాది జూన్ 14తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ముగిసింది. అసోం నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్‌కు సరిపడా బలం లేకపోవడంతో.. ఈ దఫా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100 మంది సభ్యుల బలం ఉన్నది. అలాగే 12 మంది స్వతంత్య్ర సభ్యులు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటంతో మన్మోహన్‌సింగ్ గెలుపు సాధ్యమైంది.