ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనులతో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బస్సు టిక్కెట్ల మీద ప్రచారం కోసం జీవో ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ బస్ టిక్కెట్ల మీద ఇమామ్‌లు, హజ్‌యాత్ర, జెరూసలేం గురించి ప్రచారం చేయించారని.. ఇప్పటికీ అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విషయంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తమకు అన్ని మతాలు, ప్రాంతాలు, వర్గాలు సమానమని పేర్కొన్నారు. బస్సు టిక్కెట్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటికే విచారణకు ఆదేశించారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
