తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ చైతన్యం కలిగిన జిల్లాలో ఒకటి వరంగల్ ..ఈ క్రమంలో ఓరుగల్లు కేంద్రకారాగారం హరితాగారంగా రూపుదాల్చింది. దేశంలోనే అతిపెద్ద జైలు నర్సరీ నిర్వహణ కేంద్రంగా వరంగల్ కేంద్ర కారాగారం ఇప్పు డు సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నది. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 14 లక్షల మొక్కల పంపిణీ కేం ద్రంగా ఈ నర్సరీ రూపుదిద్దుకున్నది.
50 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో జైలు ఆవరణ హరితశోభితంగా దర్శనమిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జైలు అధికారులు విజయవంతంగా అమలుచేశారు. తొలివిడుత హరితహారంలో భాగంగా 20వేల టేకు మొక్క లు నాటారు. ప్రతి మొక్క బతికేలా ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలకు సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అవన్నీ ప్రస్తుతం అతిపెద్ద జైలుగోడలతో పోటీపడి ఎదుగుతూ.. జైలు ప్రాంగణం వనాన్ని తలపించేలా మార్చాయి.
హరితనర్సరీ నిర్వహణ ఆలోచనను జైలు అధికారులు.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు నివేదించారు. కలెక్టర్.. నర్సరీని నిర్వహించేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు అనుసంధానం చేశారు. జైలు ప్రాంగణంలో దేశంలోనే ఎక్కడాలేట్టు 14 లక్షల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారులు 150 మంది చురుకైన ఖైదీలను ఎంపికచేసి నర్సరీ నిర్వహణపై అవగాహన కల్పించా రు. కుడా నుంచి ఇద్దరు పర్యవేక్షకులు ఇక్కడి ఖైదీలతో కలిసి పనిచేయిస్తున్నారు. ఇలా పనిచేసినందుకు ఒక్కో ఖైదీకి రోజుకు రూ.100 చొప్పున కూలీ చెల్లిస్తారు.