తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఉచితంగా వైద్యసేవలు అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో వినూత్న వైద్య కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణలో అమలుచేస్తున్న పలు వైద్యసేవాపథకాల ద్వారా ఏటా 85.04 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఉచిత వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆయా పథకాల ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది.
ఈ పథకాల్లో ప్రతిష్ఠాత్మకమైన ఆరోగ్యశ్రీ ద్వారా 77.19 లక్షల కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించగలుగుతున్నారు. తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీపథకానికి అర్హులవుతారు. ఇంతటి ప్రయోజకరంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను అమలుచేస్తే 52.19 లక్షల కుటుంబాలు ప్రభుత్వ వైద్యసేవలకు దూరం కానున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులకు నిర్దేశించిన అర్హతల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఎక్కువ నష్టపోవాల్సిన పరిస్థితి ఉన్నది. పేదలకు ఉచితంగా వైద్యమందించడం ప్రజాస్వామికవ్యవస్థలో ప్రభుత్వాల కనీస బాధ్యత.. అన్న భావనతో సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థంగా అమలుచేస్తున్నారు.
కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆలోచించకముందే తెలంగాణలో ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా 85.04 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా.. ఆ పథకంతోపాటు, ఇతర వైద్యపథకాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.రెండు వేల కోట్లు వెచ్చిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నది. అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా చెల్లిస్తున్నది.
సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా రూ.12 లక్షల వరకు పేదలకు వైద్యసేవలకోసం సాయమందిస్తున్నారు. అవయవ మార్పిడి, డయాలిసిస్, కెమోథెరపీ వంటి ఖరీదైన వైద్యం కూడా అందుతున్నది. అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి లైఫ్ సేవింగ్ మెడిసిన్ పేరుతో అవయవ మార్పిడులు చేసుకున్న వాళ్లకు జీవితాంతం మందులు, పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీతోపాటు, ఆరోగ్యభద్రత, ఆర్టీసీ, సింగరేణి వంటి ఆరోగ్య సంరక్షణ పథకాలతోపాటు మిగిలిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు.