టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రత్యర్థి పార్టీలే కాదు.. స్వయానా సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలంటూ…టీడీపీ అసమ్మతినేతలు చంద్రబాబు ముందు గళం ఎత్తారు. అంతే కాదు సొంత పార్టీ నేతల చేతిలో కోడెల పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే సమయంలో తన ఇంటికి తరలించిన విషయం బట్టబయలు కావడంతో కోడెల రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసెంబ్లీ సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను దోపిడీ చేసిని దొంగ..కోడెల అంటూ…అధికార వైసీపీ నేతలు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి దర్జాగా తరలించుకున్న వైనంలో కోడెల ఇమేజ్ బాగా డ్యామేజీ అయింది. దీంతో కోడెల సైతం తన ఒప్పుకోవాల్సి వచ్చింది. తన ఇంట్లో కొంత ఫర్నీచర్‌ను ఉంచిన మాట వాస్తవమే అని..కానీ ఇప్పుడు ఆ ఫర్నీచర్‌ను తిరిగి ఇస్తానంటూ కోడెల చెబుతున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో వైసీపీ నేతలే కాదు…టీడీపీ నేతలు కూడా కోడెల తప్పు పడుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల తన ఇంటికి తరలించుకోవటం ఏ మాత్రం సరికాదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు. కోడెల చేసిన ఈ పనితో పార్టీ ప్రతిష్ట మనసకాబారిందని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఫర్నీచర్ తీసుకెళ్లి ఇప్పుడు తిరిగి తీసుకెళ్లండంటూ కోడెల అనడం ఏమాత్రం సరికాదన్న వర్ల ఫర్నీచర్‌ను తన ఇంటికి తీసుకెళుతున్న విషయాన్ని అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఎందుకు చెప్పలేదని కోడెలను సూటిగా ప్రశ్నించారు. అసలు టీడీపీలో సీనియర్ నేతగా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, కోడెల ఇలాంటి చీప్ పనులు చేయడం ఏ బాలేదని వర్ల కుండ బద్ధలు కొట్టారు.
ఇక నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. గత ఐదేళ్లలో చేసిన అవినీతి, అక్రమాల కారణంగా ఈ ఎన్నికలలో కోడెలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికే కే ట్యాక్స్ దందా, ఫ్లాట్ల కబ్జాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు, కేబుల్ టీవీ స్కామ్‌లలో కోడెల ఫ్యామిలీపై పలు కేసులు నమోదు అయ్యాయి. దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోడెల ఇప్పుడు రాజకీయంగా విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచే కాదు…సొంత పార్టీ నేతలే ఆయన్ని ఈసడించుకుంటున్నారంటే..ఇంత కంటే దౌర్భాగ్యం ఏముంటుంది. మొత్తంగా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెలను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారంలో కోడెల అడ్డంగా బుక్కయ్యాడనే చెప్పాలి.